12, నవంబర్ 2016, శనివారం

తెలుగు రాష్ట్రాలలో పరిపాలన తెలుగులోనే జరగాలి



                                  తెలుగు రాష్ట్రాలలో పరిపాలన తెలుగులోనే జరగాలి  
భాషల ప్రాతిపదికపై ఏర్పడిన మొదటి రాష్ట్రం అంధ్రప్రదేశ్ .తమిళభాష ఆధిపత్యాన్ని వదిలించుకొని మన తెలుగు భాషలో మనల్ని మనమే పరిపాలించు కుందామనే సదాశయంతో ఆనాడు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసారు.ఇప్పుడు తెలంగాణా,ఆంధ్రప్రదేశ్ రెండూ తెలుగు రాష్ట్రాలే.ఉమ్మడి రాష్ట్రంలోని భాషా పరమైన కోరికలే ఇప్పటికీ తెలుగు ప్రజలలో ఉన్నాయి, ఎప్పటికీ ఉంటాయి.అవి తీరేదాకా ప్రజలు అడుగుతూనే ఉంటారు.ప్రజల భాషలో పరిపాలన జరగాలనే కోరిక అతి సహజమైనది.తెలుగు ప్రజల పోరాటాల ఫలితంగా   గతంలో కొన్ని ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చాయి. వాటి  ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో అధికార భాషగా తెలుగును ఖచ్చితంగా అమలు చెయ్యాలి.అవేమిటో చూద్దాం:
 1.ప్రభుత్వ ఉత్తర్వు (సాధారణ పరిపాలన అ.భా శాఖ) సంఖ్య 167 తేదీ .19.3.1988 ప్రకారం ఆంగ్లంలో వచ్చిన ఏ ఉత్తరం పైనా ,ప్రతిపాదనపైనా ఎలాంటి చర్య తీసుకోకుండా తిప్పి పంపే అధికారం ప్రతి గజిటెడ్ అధికారికీ ఉంది.తమకంటే పై అధికారుల కార్యాలయాలనుండి వచ్చినా సరే ఆంగ్లంలో వచ్చిన లేఖలను తిప్పి పంపవచ్చు.ఈ విధంగా చేయడం వల్ల జరిగే కష్ట నష్టాలకు,జాప్యానికీ వాటిని ఆంగ్లంలో పంపిన అధికారులదీ ,కార్యాలయాలదే బాధ్యత.
2. ప్రభుత్వ ఉత్తర్వు (సాధారణ పరిపాలన అ.భా శాఖ) సంఖ్య 587 తేదీ .28.10.1988
ప్రకారం 1988 నవంబరు 1 వ తేదీ నుండి రాష్ట్రంలో ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగులోనే జరగాలి.అన్ని ప్రభుత్వ ఉత్తర్వుల జారీకి తెలుగు భాషనే ఉపయోగించాలి.ఆంగ్లం వాడకూడదు.కేంద్ర ప్రభుత్వం,ఇతర రాష్ట్రాలు,రాష్ట్రం వెలుపల ఉన్న చిరునామాదారులతో మాత్రమే ఆంగ్లం ఉపయోగించాలి
3. ప్రభుత్వ ఉత్తర్వు (సాధారణ పరిపాలన అ.భా శాఖ) సంఖ్య 218 తేదీ .22.31990 ప్రకారం అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ,రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్న అన్ని సంస్థలు,అన్ని స్థానిక సంస్థలు తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలి.అన్ని శాసనేతర అవసరాలకు ప్రజలతో జరిపే ఉత్తర ప్రత్యుత్తరాలకూ తెలుగు భాషనే ఉపయోగించాలి.
4. ప్రభుత్వ ఉత్తర్వు( సాధారణ పరిపాలన అ.భా శాఖ) సంఖ్య 420 తేదీ .13.9.2005  ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వులు,నియమాలు,నిబంధనలు,ఉపవిధులు అన్నీ కూడా తెలుగు భాష లోనే ఉండాలి.
5. ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 11 (యువజన & సాంస్కృతిక అధికార భాష శాఖ) తేదీ.14.9.2016 ప్రకారం రాష్ట్రంలోని అన్ని దుకాణాలు ,సముదాయాల బోర్డులు ప్రభుత్వ పధకాల ప్రారంబోత్సవ నామఫలకాలు,శంకుస్థాపన శిలాఫలకాలు తెలుగులోనే రాయించాలి.
పై ఉత్తర్వులన్నీ ఖచ్చితంగా అమలుచేస్తే పరిపాలన పూర్తిగా తెలుగులోనే జరుగుతుంది.
మరి తెలుగు పరిస్థితి ఎందుకు ఇలా తిరగబడింది ?
తెలుగువాడిగా పుట్టటం ఎన్నోజన్మల పుణ్యఫలం అనీ,రాయల కాలంనాటి రాజభాష అనీ గొప్పలు చెప్పుకోవటమే గానీ క్రమంగా తెలుగు భాష కవిత్వాలకు మాత్రమే పరిమితమై పోయింది. వాస్తవానికి ప్రపంచంలో ఎన్నో భాషలు కాలగమనంలో రాలిపోతూనే ఉన్నాయి.తెలుగులో చదువుకొనే పిల్లలు తగ్గిపోయారు.తెలుగు బడులు మన కళ్ళముందే ఇంగ్లీష్ కాన్వెంట్లు గా మారిపోయాయి.ఇక అటెండర్ ఉద్యోగానికీ తెలుగు అక్కరలేదనే అభిప్రాయానికి ప్రజలు వచ్చేసారు.ప్రాధమిక పాఠశాలలు కూడా ఇంగ్లీషువే కావాలని పట్టుబడుతున్నారు.ఎందుకంటేఇంగ్లీషు చదువువల్ల,విదేశాల్లో కొలువులవల్ల డబ్బు సంపాదన విపరీతంగా ఉంది.తెలుగు మాత్రమే చదివితే ఉద్యోగాలు రాని పరిస్థితి ఉంది.తెలుగు భాష ద్వారా కూడా ఉద్యోగాలూ,డబ్బు వస్తుంటే అప్పుడు కొందరైనా స్వార్ధం కొంత చంపుకొని తెలుగు చదువుతారు.భాషతో సాంకేతిక,ఆర్ధిక విషయాలను ముడిపెట్టకుండా అభివృద్ధి సాధ్యంకాదని స్వర్గీయ అబ్దుల్ కలాం గారు చెప్పారు.ఏ జాతి సమస్త వ్యవహారాలు ఆ జాతి మాతృ భాషలోనే జరుగుతాయో ఆ జాతి సుఖపడుతుంది.అది ఎప్పటికీ విజేతగానే ఉంటుంది. భాష పేరుతో ఐక్యత,అభివృద్ధీ కోరే వాళ్ళు ఆ భాషను బ్రతికించటానికి కృషి చెయ్యాలి.మన భాషలో పరిపాలన బాగా జరగటానికి ఇంకా ఏమేమి  పనులు చెయ్యాలో చూద్దాం:
1. నిఘంటువులు
ఎన్ని ఎక్కువ తెలుగు నిఘంటువులు నెట్‌లో చేరితే తెలుగు అంతగా బలపడుతుంది.ఆధునిక అవసరాలకు ధీటుగా తెలుగు భాష తయారు కావాలి. ఇంగ్లీషులో ఉన్న సౌలభ్యాలన్నీ తెలుగుకూ కల్పించాలి. పదాల శుద్ధి`యంత్రం, గుణింత, వ్యాకరణ పరిష్కారయంత్రం, సాంకేతిక నిఘంటువులు, మాండలిక నిఘంటువులు, డిజిటల్‌నిఘంటువులు, అమరకోశాలు, పదశోధనా యంత్రాలు, ఉచ్ఛారణ పద ప్రయోగ నిఘంటువులు, వ్యుత్పత్తి కోశాలు, లిపిబోధినిలు, సాహిత్య శోధనా పరికరాలు, పదాను క్రమణికలు... ఇలా ఎన్నో రావాల్సిన అవసరం ఉంది. ఆన్‌లైన్‌లోనే నిఘంటువులకు కొత్త పదాలను జోడించే అవకాశం అందరికీ ఇవ్వాలి. ఏయే ప్రాంతాల్లో ఏ పదాన్ని ఎందుకు, ఎలా వాడుతుంటారో ఆయా ప్రాంతాల ప్రజలనే చెప్పనివ్వాలి. సరిగా ఉన్నట్లు భావించిన కొత్త పదాలను ఎప్పటికప్పుడు నిఘంటువుల్లో చేరుస్తూ పోవాలి. మన నిఘంటువుల సైజు పెరగాలి. అవి కార్యాలయాలలో వాడకంలోకి విస్తారంగా వస్తూనే ఉండాలి.
2.సాఫ్ట్ వేర్లు
 తమిళంలో ఉత్తమ సాఫ్ట్ వేర్‌ను ఎంపిక చేసి, దాని రూపకర్తకు కన్యన్‌పూంగుండ్రనాథ్ పేరుతో రూ.1 లక్ష నగదు అవార్డు, ప్రశంసపత్రం ప్రతి సంవత్సరం పంపిణీ చేస్తున్నారు. తెలుగులో కూడా  ఉత్తమ సాఫ్ట్ వేర్ లు తయారుచేసిన సాంకేతిక నిపుణులకు,తెలుగు భాషకు ఉపకరించే సులభ ఉపకరణాలను తయారు చేసిన సాంకేతిక పరిజ్నానులకు తెలుగు వైతాళికుల పేరు మీద ప్రోత్సాహక బహుమతులు ఇవ్వాలి.తర్జుమా పరికరాల తయారీ ప్రారంభదశలో ఉంది గనుక కొన్ని తప్పులు వస్తున్నాయి.అనువాద ఉపకరణాలు, నిఘంటువులు, లెక్కకు మిక్కిలిగా రావాలి. ఆన్‌లైన్‌లోనూ ఆఫ్‌లైన్‌లోనూ వాటిని విరివిగా లెక్సికన్లు వాడుకునే సౌలభ్యాలు కలగాలి.యంత్రానువాదాలకూ, లిప్యంతరీకరణకూ, విషయాలకు ఆకారాది సూచికలను తయారు చేయటానికీ, వెతకటానికి అనుకూలంగా తెలుగులో కంప్యూటర్‌ వాడకం పెరగాలి.కంప్యూటర్లలో సాంకేతిక తెలుగు భాషాభివృద్ధికి రూ.100 కోట్ల నిధులు ఏర్పరచాలి.
3.మార్కులు, ఉద్యోగాలు
తమిళనాడు ప్రభుత్వం జీవో ఎం ఎస్ నంబర్ 145 P & AR (S) డిపార్ట్ మెంట్ తేదీ. 30.09.2010 ద్వారా తమిళ మీడియం లో డిగ్రీ వరకు చదివిన అభ్యర్దులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 20 శాతం రిజర్వేషన్ ఇస్తున్నారు.చెన్నై హైకోర్టు కూడా 23.2.2016 న ఈ చట్టాన్ని సమర్ధించింది.ప్రమోషన్లలో కాకుండా ప్రభుత్వోద్యాగాలకు మొదటిసారిగా నేరుగా జరిపే నియామకాలకు తమిళ మాధ్యమంలో చదివిన అభ్యర్దులకు 20% ఉద్యోగాలు రిజర్వు చేయడంలో ఎలాంటి తప్పూ లేదని తేల్చేసింది.రాజ్యాంగంలోని 345 ఆర్టికిల్ ప్రకారం ఎవరి భాషను వాళ్ళు కాపాడుకోవాలని,ఆయా రాష్ట్రాలలో పాలనాభాషగా అధికారభాషగా అభివృద్ధి చేసుకోవాలని కూడా తెలియ జేసింది.కాబట్టి తమిళనాడును ఆదర్శంగా తీసుకొని  ఒకటవ తరగతి నుండి డిగ్రీ వరకు తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులకు పోటీ పరీక్షల్లో ప్రోత్సాహకాలు ఇవ్వాలి.తమిళనాడులో లాగా ఉద్యోగాలలో 20% రిజర్వేషన్ ఇవ్వాలి.  గ్రూప్‌ 1, గ్రూప్‌ 2,3 లాంటి  సర్వీసు ఉద్యోగాలలో తెలుగు మీడియంలో చదివిన వారికి గతంలో ఇచ్చిన మాదిరే 5% ప్రోత్సాహక మార్కులు ఇవ్వాలి.
4.అధికారభాషా సంఘం,అకాడమీ 
 వ్యాపార సంస్థలు,దుకాణాలన్నీ తెలుగులో బోర్డులు ఏర్పాటు చేయకపోతే వాటి లైసెన్సులు రద్దు చేసే అధికారం కన్నడ అధికార భాషా సంఘానికి ఉన్నట్లుగా, తెలుగు అధికార భాషా సంఘానికి కూడా ఉండాలి. మండల స్థాయి నుండి సచివాలయం వరకు అధికార భాషను అమలు చెయ్యని అధికారులపై చర్యలు తీసుకునే అధికారం అధికార భాషా సంఘానికి ఇవ్వాలి. తెలుగు విశ్వవిద్యాలయం, అధికార భాషా సంఘం, తెలుగు అకాడవిూ, అన్ని విశ్వవిద్యాలయాల్లోని తెలుగు విభాగాలు కలసికట్టుగా కృషిచేసి ఏయేటికాయేడు అవి తెలుగు భాషాభివృద్ధి కోసం ఏంచేశాయో, ఏం సాధించాయో ప్రగతి నివేదికలను తెలుగు ప్రజలకు బయటపెట్టాలి. ఈ సంస్థలన్నీ ప్రజల నుండి సూచనలు తీసుకోవాలి. పరిపాలక గ్రంథాలు కోడ్లు, మాన్యువల్‌లు, లాంటివన్నీ తెలుగులో ప్రచురించి అన్ని కార్యాలయాలకు పంపాలి. సర్వీస్‌కవిూషన్‌ పోటీ పరీక్షలు, శాఖాపరమైన పరీక్షలు తెలుగులో నిర్వహించాలి.
5.సచివాలయం, శాసనసభలు,న్యాయస్థానాలు
హైకోర్టులో తెలుగులో వాదనలకు అనుమతించాలి. తెలుగును రెండవ జాతీయ భాషగా ప్రకటించాలి. మన ప్రజల భాషలోనే జీవోలు రావాలి. అప్పుడే తెలుగు అధికార భాషగా విరాజిల్లుతుంది.తెలుగు భాష మాట్టాడేవాళ్ళ సంఖ్యనుబట్టి, జనబలాన్ని బట్టి పార్లమెంటులో మన గౌరవం మనకు దక్కుతుంది. హిందీతో పాటు తెలుగును కూడా ఇతర భాషలవాళ్ళు నేర్చుకోవాల్సి వస్తుంది.పార్లమెంటులో హిందీ వాళ్ళలాగా మనం కూడా తెలుగులో మాట్లాడవచ్చు. కేంద్ర ప్రభుత్వం జారీచేసే ఉత్తర్వులన్నీ తెలుగులో పొందవచ్చు. కేంద్రంతో ఉత్తర ప్రత్యుత్తరా లన్నీ తెలుగులో నడుపవచ్చు. చట్టాలన్నీ తెలుగులోకి మార్చబడతాయి. తెలుగులో తీర్పులొస్తాయి. తెలుగులో ఇచ్చే అర్జీలు ఢిల్లీలో కూడా చెల్లుతాయి. ఇతర రాష్ల్రాల్లో ఉన్న తెలుగువారికి కొండంత అండ, గౌరవం హిందీ వాళ్ళతో పాటు సమానంగా లభిస్తాయి. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వేస్టేషన్లలో బోర్డుల విూద తెలుగులో కూడా పేర్లు రాస్తారు. ఈ రోజున హిందీ భాష వల్ల హిందీ వాళ్ళకు ఏయే ప్రయోజనాలు ఒనగూడాయో అవన్నీ తెలుగు వాళ్ళు కూడా పొందవచ్చు.
                                                                      --- నూర్ బాషా రహంతుల్లా  9948878833

11, నవంబర్ 2016, శుక్రవారం

సర్వీస్‌ కమిషన్లకు తెలుగు భాషా సేవ చేయాలి (సూర్య 12.11.2016)


సర్వీస్‌ కమిషన్లకు తెలుగు భాషా సేవ చేయాలి



(సూర్య 12.11.2016)

-గ్రూప్‌-2,3 సర్వీసు ఉద్యోగాల భర్తీకి కసరత్తు చేస్తున్న సర్వీస్‌ కమిషన్లు
-తెలుగు మాధ్యమ విద్యార్థులకు ఛాన్సు ఇవ్వాలి
-5 శాతం అదనపు మార్కులతో ప్రోత్సహించాలి
-తెలుగు మాట్లాడే జనం సమస్య తీర్చే పోస్ట్ లు
-తెలుగుభాషలోనే వ్యవహారాలు సాగాలి
-ప్రజలతో మమైకమైతేనే రాష్ట్రాల అభివృద్ధి
-జనం భాషకు ప్రభుత్వాలు పట్టం కట్టాల్సిందే

తెలుగుభాషకూ ,తెలుగు విద్యార్ధులకూ సేవ చేసేందుకు సర్వీస్ కమీషన్లకు మంచి అవకాశం వచ్చింది . త్వరలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాలు రెండూ భారీ ఎత్తున గ్రూప్‌-2,3 సర్వీసు ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నాయి. వీటిలో మున్సిపల్‌ కమిషనర్‌, ఏసీటీఓ, సబ్‌ రిజిస్ట్రార్ , డిప్యూటీ తహసిల్దార్‌, అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ డెవలప్ మెంట్‌ ఆఫీసర్‌, ఎక్‌‌స టెన్షన్‌ ఆఫీసర్‌,ఎకైసజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌,అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌, సీనియర్‌ ఆడిటర్‌, సీనియర్‌ అకౌంటెంట్‌, జూనియర్‌ అకౌంటెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, గ్రామపంచాయతీ సెక్రెటరీ లాంటి ఉద్యోగాలున్నాయి.
తెలుగు ప్రజలతో వ్యవహరించే ఉద్యోగాలే
ఇవన్నీ ఐ ఏ ఎస్‌ ,ఐ పి ఎస్‌ లాంటి ఉన్నతోద్యోగాలు కావు. తెలుగు ప్రజలతో మమేకమై వారితో ముఖాముఖి తెలుగులో మాట్లాడుతూ వారిమధ్యే నివసిస్తూ వారికి సేవలందించే ఉద్యోగాలు. తెలుగు ప్రజల సమస్యలను సరిగ్గా విశ్లేషణ చేయాలి. గ్రామ సామాజిక , ఆర్థిక వ్యవస్థ పై తగిన అవగాహన తెచ్చుకోవాలి. ప్రజా పరిపాలన పరిజ్ఞానం పెంచుకోవాలి. అక్కడి ప్రజలు వారి భాషలో చెప్పే సమస్యలు, పరిష్కారాలు, సూచనలు వినాలి, రాయగలగాలి . ఈ నైపుణ్యాలన్నీ ప్రజల భాష లో తెలుగు మాధ్యమంలో చదివిన వారికే ఎక్కువగా ఉంటాయి.
తెలుగు విద్యార్ధులకు ఎన్ని ఉద్యోగాలు?
ఈ ఉద్యోగాలలో తెలుగు మాధ్యమం ద్వారా డిగ్రీలు చేసిన వారికి ఎన్ని దక్కుతాయనేదే నేటి ప్రశ్న. జన్మభూమినీ మాతృభాషను మరువకండి అని పదే పదే తెలుగు నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. మన తెలుగుకు ప్రాచీన భాష హోదా రాకుండా అడ్డుపడిన తమిళులతో పోరాడి మరీ సాధించారు. ప్రాచీన భాషా కేంద్రాన్ని కూడా తెలుగు నేలపైకి త్వరలో తేబోతున్నారు. ప్రజల భాషకు పరిపాలనలో పట్టం కడతామనే నాయకుల వాగ్దానాలు రెండు రా„షా్టల్ల్రోనూ వినబడుతున్నాయి. తెలుగును ఉపాధి వనరుగా మార్చాలని అందరూ కోరుతున్నారు. కొందరైతే ప్రజల భాష పదికాలాలపాటు పాలించాలని తపిస్తున్నారు కూడా. తెలుగు విద్యార్ధులు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు పొందేలా ప్రజా సేవ (పబ్లిక్‌ సర్వీస్‌) చేసే బంగారం లాంటి అవకాశం మన సర్వీసు కమీషన్లకు వచ్చింది.
తెలుగు మాధ్యమ అభ్యర్థులను ఆదరించాలి
2012 ప్రపంచ తెలుగు మహాసభల్లో చేసిన తీర్మానాలు ప్రకటించిన విధానాలు చూస్తే తెలుగు ప్రాణం పోసుకొని తిరిగి లేస్తుందనిపించింది. కాల గమనంలో మన ఆశలు నీరుగారిపోయాయి. 2016లో కూడా మళ్ళీ అవే అంశాలపై అవకాశాలు అన్వేషిస్తున్నాం . తెలుగునాట తెలుగు మీడియం విద్యార్ధులకు పోటీ పరీక్షల్లో ఇంగ్లీషు చదువు వల్ల, విదేశాల్లో కొలువులవల్ల డబ్బు సంపాదన విపరీతంగా ఉంది కాబట్టే అటు జనం పరుగులు పెడుతున్నారు. ఇక్కడే ఉండి దేశ ప్రజలకే సేవ చెయ్యండి, విదేశాలకు పోకండి అని వావిలాల, కాళోజీ లాంటి మహనీయులు ఎంతగా చెప్పినా ఎవరూ వినలేదు. వినటం లేదు. కారణం తెలుగు మాత్రమే చదివితే ఉద్యోగాలు రాని పరిస్థితి ఉంది. తెలుగు భాష ద్వారా కూడా ఉద్యోగాలూ, డబ్బు వస్తుంటే అప్పుడు కొందరైనా స్వార్థం కొంత చంపుకొని తెలుగులో విద్యభ్యాసం చేస్తున్నారు. భాషతో సాంకేతిక, ఆర్ధిక విషయాలను ముడిపెట్టకుండా అభివృద్ధి సాధ్యం కాదు. సమస్త వ్యవహారాలు మాతృభాషలో జరిగే దేశాలే అభివృద్ధి చెందుతాయి. భాష పేరుతో ఐక్యత కోరే వాళ్ళు ఆ భాషను బ్రతికించటానికి కూడా కృషి చెయ్యాలి. మాతృ భాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనదే
ప్రోత్సాహకాలు కావాలి
తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులకు పోటీ పరీక్షల్లో ప్రోత్సాహకాలు ప్రకటిస్తే తెలుగు మనుగడకు దోహద పడుతుంది. గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 సర్వీసు ఉద్యోగాలలో డిగ్రీ తెలుగు మీడియంలో చదివిన వారికి గతంలో ఇచ్చిన మాదిరే 5% ప్రోత్సాహక మార్కులు ఇస్తే, తెలుగులో కార్యాలయ వ్యవహారాలు నడిపే వాళ్ళు రంగపవ్రేశం చేస్తారు. కొంతవరకైనా ఆఫీసుల్లో తెలుగు బతికి బట్టకడుతుంది. తెలుగు విూడియంలో చదివితే ఉద్యోగా లొస్తాయన్న ఆశతో కొంత మందైనా తెలుగులో చదువుతారు. తెలుగులో చదివిన అధికారులు కార్యాలయాల్లో జరిగే పనులన్నిటికీ ''కొత్తపదాలు'' పుట్టిస్తారు. తెలుగు పదకోశాలు అమలవుతాయి. పరిపాలనకు పనికొచ్చే శాస్త్రీయ తెలుగు తయారవుతుంది. అధికార భాషగా తెలుగును అమలు చేయాలనే పట్టుదల, ఆకాంక్ష ఉంటే తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థుల్ని ప్రోత్సహించి అధికారులుగా చేయాలి. కేవలం తెలుగు మీడియంలో మాత్రమే చదివిన వాడికి ఇంగ్లీషురాక పోయినా ఎటువంటి శాస్త్ర సాంకేతిక రంగంలోనయినా ఉద్యోగం గ్యారంటీగా వస్తుందనే భరోసా కల్పించాలి. భాషను ఉపాధికి సాంకేతికతకు ముడి పెట్టాలని దివంగత రాష్టప్రతి అబ్దుల్‌ కలాం అన్నారు.అంటే తెలుగు మాధ్యమంలో చదివినా కలెక్టరు, డాక్టరు, ఇంజనీరు కాగలిగే విధంగా మన విద్యా వ్యవస్థ మారాలి! తెలుగు మీడియంలో చదివిన విద్యార్ధులకు సర్వీసుకమీషను పరీక్షల్లో రిజర్వేషన్లో, ప్రోత్సాహక మార్కులో తిరిగి ఇప్పించటానికి కృషి చేస్తామని 2012 ప్రపంచ తెలుగు మహాసభల్లో చేసిన ప్రకటన ప్రభుత్వ ఉత్తర్వుగా రావాల్సిఉంది.
తమిళనాడు భాషా విధానం అనుసరణీయం
కోయంబత్తూరులో జరిగిన ప్రపంచ తమిళ మహాసభల్లో తమిళ మాధ్యమ విద్యార్ధులకు ప్రభుత్వ ఉద్యోగాలు సులభంగా లభించేలా కొన్ని తీర్మానాలు చేశారు. తమిళ మీడియం అభ్యర్దులకు ఉద్యోగాలు దొరకక పొతే ప్రజలు పిల్లల్ని తమిళ మాధ్యమం లో చదివించరనీ ,ఎవరూ చదవని భాష నశిస్తుందనీ ,తమిళం పదికాలాలపాటు బ్రతకాలంటే ఆభాషలో మాత్రమే చదివిన వారికి వెనుక బడిన కులాలవారికి ఇస్తున్నట్లుగా ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని తీర్మానం చేశారు .అందుకోసం అత్యవసరంగా ఒక ఆర్డినెన్‌‌స తెచ్చారు. శాసన సభలో, స్థానిక సంస్థల్లో ,ప్రభుత్వ కార్పోరేషన్లు, కంపెనీలలో తమిళ అభ్యర్దులకు 20 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని శాసించారు.
తమిళనాడు ప్రభుత్వం జీవో ఎం ఎస్‌ నంబర్‌ 145 డిపార్‌‌ట మెంట్‌ తేదీ. 30.09.2010 ద్వారా తమిళ మీడియం లో డిగ్రీ వరకు చదివిన అభ్యర్దులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 20 శాతం రిజర్వేషన్‌ ఇస్తున్నారు. చెన్నై హైకోర్టు కూడా 23.2.2016 న ఈ చట్టాన్ని సమర్ధించింది. ప్రమోషన్లలో కాకుండా ప్రభుత్వోద్యాగాలకు మొదటిసారిగా నేరుగా జరిపే నియామకాలకు తమిళ మాధ్యమంలో చదివిన అభ్యర్దులకు 20% ఉద్యోగాలు రిజర్వు చేయడంలో ఎలాంటి తప్పూ లేదని తేల్చేసింది.రాజ్యాంగంలోని 345 ఆర్టికిల్ ప్రకారం ఎవరి భాషను వాళ్ళు కాపాడుకోవాలని,ఆయా రాష్ట్రాలలో పాలనాభాషగా అధికారభాషగా అభివృద్ధి చేసుకోవాలని కూడా తెలియ జేసింది.
తెలుగు రాష్ట్రాల ‘సర్వీస్’ కమీషన్ల కర్తవ్యం
తెలుగు మీడియంలో డిగ్రీ చదివిన వారికి తమిళనాడు తరహాలో 20% ఉద్యోగాలు రిజర్వేషన్‌ ఇవ్వాలి ఉమ్మడి రాష్ట్రంలో 1985 వరకు ఇచ్చినట్లు పోటీ పరీక్షల్లో 5% ప్రోత్సాహక మార్కులు ఇవ్వాలి. తెలుగు అభివృద్ధి మంత్రిత్వ శాఖల పెద్దలందరూ ఇలాంటి ప్రతిపాదనల అమలుకు ఆహ్వానం పలుకుతున్నారు. అడ్డుచెప్పటం లేదు. కాబట్టి తెలుగు నిరుద్యోగులకు ప్రోత్సాహకాలు అందజేసే మంచి అవకాశం సర్వీస్‌ కమీషన్లకు వచ్చింది. ఉద్యోగ నియామకాలు పూర్తయ్యే లోపు ఈ ప్రతిపాదనలను పబ్లిక్‌ సర్వీసు కమీషన్లు ప్రభుత్వానికి పంపి ఆమోదం పొందాలి.
----నూర్ బాషా రహంతుల్లా 9948878833
http://www.suryaa.com/news/opinion/edit-page/article.asp…
(విశాలాంధ్ర 14.11.2016)
 http://54.243.62.7/images_designer/article_docs/2016/11/13/mainall.pdf