25, మార్చి 2018, ఆదివారం

దక్షిణాది వారిది ద్రావిడ సంగీతమే

దక్షిణాది వారిది ద్రావిడ సంగీతమే
ఉత్తరాది వాళ్ళ సంగీతాన్ని హిందూస్థానీ సంగీతం అన్నట్లుగానే దక్షిణాది వాళ్ళ సంగీతాన్ని ద్రావిడ సంగీతం అనాలని ద్రావిడ మున్నేట్ర కజగం పార్టీ గతంలోనే కోరిందట.నాకూ ఈ కోరిక సమంజసమే అనిపించింది.ఉత్తరాది సంగీతానికి పెట్టిన హిందూస్థానీ అనే పేరు ఒక ప్రాంతాన్నో,మతాన్నో,భాషనో సూచిస్తోంది.అదే ఒరవడిలో కర్ణాటక అనే పేరుకు అర్ధం చెప్పండి.అది కర్ణపేయమైన,శ్రావణానందకరమైన సంగీతం అని కాక కర్ణాటక ప్రాంతంలో పుట్టిన సంగీతం కన్నడిగుల సంగీతం అన్నట్లుగా ఉంది. ఎక్కడికక్కడ ఎవరి గుర్తింపు కోసం వాళ్ళు పోరాడుతున్నారు.ద్రావిడ సంగీతం మొత్తానికీ కలిపి ‘కర్ణాటక సంగీతం ‘ అనే పేరు సాధించుకున్న కన్నడిగులు కన్నడ జెండా కూడా రూపొందించుకున్నారు.
మనకు ఎన్టీ రామారావు తెలుగు దేశం పేరుతో ఒక పార్టీ స్థాపించి మన ప్రజల భాష తెలుగులో రాసిన ఫైళ్ళు తెస్తేనే సంతకం పెడతానని భీష్మించాడు.అప్పుడు తెలుగులో దస్త్రాలు బాగా నడిచాయి.అంతేకాక తెలుగు మాధ్యమంలో డిగ్రీ చదివిన అభ్యర్డులకు సర్వీస్ కమీషన్ పరీక్షలలో 5 శాతం ప్రోత్సాహక మార్కులు ఇచ్చి ఎక్కువమంది తెలుగు చదివిన అభ్యర్డులు ఉద్యోగాలలోకి వచ్చేలా చేశారు. ఆతరువాత ఆంధ్రాను ఆంగ్లం కమ్మేసింది. అప్పటిదాకా తెలుగు మాధ్యమ అభ్యర్ధులకు ఇచ్చిన ప్రోత్సాహక మార్కులను ఏ నాయకుడూ పునరుద్ధరించలేదు. తెలుగులో మాట్లాడితే తప్పంటూ పిల్లల మెడలో పలకలు కట్టి అవమానించే రోజులు దాపురించాయి.నాకు ఇంగ్లీషు తప్ప తెలుగు రాదు అని చెప్పుకోవటమే గొప్పతనమైపోయింది. తెలుగుకు ఎక్కడా స్థానం లేకుండా పోయింది. దానికి రావలసిన గౌరవం రావటం లేదు. పోరాడితే తప్ప తెలుగు విలువ ,పేరు నిలవనివ్వని శక్తులు నలువైపులా కాచుకొని ఉన్నాయి.
స్వాభిమానం ఏది?
త్యాగయ్య తెలుగులో తప్ప మరే భాషలోనూ పాడలేదు. తాను నివసించిన తమిళనాడు లో తమిళంలో కానీ ,కర్నాటక సంగీతం అని పేరుగాంచిన కన్నడ భాషలో గానీ కీర్తనలు రాయలేదూ.త్యాగయ్య తెలుగు కీర్తనలు ద్రావిడులంతా తెలుగులోనే పాడుతారు.తెలుగువారు పెద్దగా తమిళ,మళయాళ కీర్తనలు పాడరు. దక్షిణ భారతదేశ ద్రావిడ సంగీతాన్ని ఇంతగా ప్రభావితం చేసిన త్యాగయ్య తెలుగు కీర్తనలను బట్టి దీనిని "తెలుగు సంగీతం" లేదా “ద్రావిడ సంగీతం” అనో అనకుండా కర్నాటక సంగీతం అని ఎందుకు అన్నారో? ఎందుకోగానీ తెలుగు సంగీతం , ఆంధ్ర సంగీత సాంప్రదాయమన్న మాట ప్రాచుర్యానికి నోచుకోలేదు. తెలుగు వాళ్ళు శాంత స్వభావులు. ద్రావిడ ప్రాంతంలో ఎంతో విలువైన సంగీత సంపదను తెలుగు విద్వాంసులు పోగుచేసి పెట్టారు.తమకు రావలసిన పేరు ఇతరులు ఎగరేసుకు పోతున్నా నోరుమెదపని సహనశీలురు తెలుగు పెద్దలు. పక్కన కన్నడభాషను కించపరిస్తే ఊరుకోము అని కన్నడిగులు ఆగ్రహిస్తున్నారు.అయినా తెలుగు భాషకు న్యాయబద్ధంగా రావలసిన కీర్తిని రాబట్టడంలో తెలుగు ప్రజలు ఉదాసీనంగా ఉన్నారు. సంగీతమంతా తెలుగువాళ్ళది పెట్టుకొని పేరు మాత్రం తెలుగేతరులు పొందుతున్నారు.
తెలుగును ద్రావిడీకరించినవాడు ,తొలి తెలుగు భాషోధ్యమకారుడు నాదృష్టిలో త్యాగయ్యే.కర్ణాటక సంగీత మంటే అది చెవికి ఇంపైనది అని కొందరు అర్ధం చెబుతారు. మరే ద్రావిడభాషకూ అంత ఇంపు లేదనా అర్ధం? ఇది భాషారాజకీయమే. సంగీతానికి ఒక ప్రాంతము పేరో ఒక భాషపేరో పెట్టేటప్పుడు ఆయా భాషల వాళ్ళు ఆయా ప్రాంతాలవాళ్ళూ ఆ సంగీతానికి చేసిన విశేషమైన కృషి ఏమిటో చెప్పితీరాలి. మన అన్నమయ్య త్యాగయ్య రామదాసు లు ఎవరికీ తీసిపోరు. వాళ్ళు కర్ణాటక సంగీతాభివృద్ధికి చేసిన కృషి పడినపాట్లు చరిత్రలోకి ఎక్కాలి. కర్ణాటక సంగీతం అని పేరు ఎందుకు పెట్టారో,అలా పేరు పెట్టినప్పుడు తెలుగువాళ్ళు మెదలకుండా ఎందుకు ఒప్పుకున్నారో అసలు కారణం తెలుసుకుందామనే ఈ చర్చ.
కర్ణాటక సంగీతం అంటే దక్షిణాది సంగీతమే. కానీ దానికి ద్రావిడ సంగీతం అని పేరు పెట్టకుండా కర్ణాటక సంగీతం అని పేరు పెట్టటం వెనుక భాష.ప్రాంతాల ప్రభావం ఏమైనా ఉందేమో తెలుసుకుందామని ఈ ప్రయత్నం. మరాఠీ వాడైన పురందరదాసు (1484 – 1564) కన్నడంలోనే కీర్తనలు రాశాడు.అతన్ని కర్ణాటక సంగీత పితామహుడు,కన్నడ వాగ్గేయకారుడు అన్నారు. అలిపిరి దగ్గర అతని విగ్రహం పెట్టారు.ఆయన ఆంధ్ర పదకవితా పితామహుడు ,తెలుగు వాగ్గేయకారుడైన అన్నమాచార్యులను గురువుగా భావించాడు.అన్నమయ్యను శ్రీనివాసుని అవతారం అని పొగిడాడు. కర్ణాట సంగీతాభివృద్ధికి కృషిచేసిన విద్వాంసులలో త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి , అరుణాచల కవి, నారాయణ తీర్థులు, విజయదాసు, రామదాసు, సదాశివ బ్రహ్మేంద్ర, ఊటుకూరి వెంకటకవి లాంటి తెలుగు,తమిళ,కన్నడ మహానుభావులు ఎందరో ఉన్నారు.ప్రాంతాలవారిగా చూస్తే కర్ణాటక సంగీతానికి మద్రాసు కేంద్రబింధువై నిలిచింది.దక్షిణాది రాష్ట్రాల విద్వాంసులెందరో తమిళనాడు చేరారు.కర్ణాటక సంగీత విద్వాంసులలో తెలుగువాళ్ళే ఎక్కువమంది ఉన్నారు.పురందరదాసుకు గురుతుల్యుడూ సమకాలికుడైన అన్నమాచార్యుని కృషిని గుర్తిస్తే ఆంధ్ర సంగీతమనో తెలుగు సంగీతమనో పేరు పెట్టవచ్చు. తెలుగు వాళ్ళను ఎలా ఎందుకు తప్పించారో తెలుసుకోవాలి.
దక్షిణాది వారిది ద్రావిడ సంగీతమే
ఉత్తరాది వాళ్ళ సంగీతానికి భారతదేశం మొత్తం కలిసిన దేశ జాతీయ సంగీతమనే అర్ధం స్పురించేలా హిందూస్థానీ సంగీతం అన్నారు. దక్షిణాది అంతటా ఒకే విధంగా వినపడే సంగీతానికి ద్రావిడ సంగీతం అని పేరు పెట్టినా బాగుండేది.
తమిళంలో ముత్తయ్య భాగవతార్,సదాశివ బ్రహ్మం, పాపనాశం శివం మళయాళంలో స్వాతి తిరునాళ్,…. ఇలా ఎందరో ద్రావిడ మహానుభావుల కృషి ఫలితమే ద్రావిడ సంగీతం. తన పేగులనే తీగలుగా వీణ వాయించి పరమ శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నా రావణుడు గొప్ప ద్రావిడ సంగీత వేత్త కాదా? ద్రావిడ శబ్ధమే ఉత్తరాది పాలకులకు రుచించటంలేదు. సంగీతం విశ్వజనీన భాష. అది అందరికీ అర్ధమయ్యే ప్రపంచభాష ,హృదయ భాష.మరి అందులో రాణించిన తెలుగు వాళ్ళ పేర్లు ఆ సంగీతానికి ఎందుకు పెట్టలేదు? పోనీ ప్రాంతం పేరుతో అయితే విశ్వకవి జాతీయగీతంలో అన్నట్లు దక్షిణాదిన ఉన్న నాలుగు రాష్ట్రాలనూ కలిపి ద్రావిడ సంగీతం అనే అనాలి. ఎందుకంటే ఈ సంగీతం ద్రావిడ రాష్ట్రాలలో పుట్టి పెరిగింది కాబట్టి.
తెలుగు కీర్తనలకు దేవుళ్ళు దిగి వచ్చారు
బమ్మెర పోతన, కంచర్ల గోపన్న (రామదాసు),త్యాగయ్య,అన్నమయ్య,లాంటి ఆద్యాత్మిక వేత్తలు ,సంగీత కారులు,మహా భక్త గాయకులు,భగవంతుని దయానుగ్రహాలపై తమకు హక్కు ఉన్నట్లు గా రచించిన కీర్తనలన్నీ తెలుగులోనే ఉన్నాయి .ఆ తెలుగు కీర్తనలు విని దేవుళ్ళు దిగి వచ్చారని బడాయి పోతుంటాము. వారి భాషను మాత్రం దైవ భావన లేకుండా అగౌరవ పరుస్తాము.ఇదేం నీతి?
“పలికెడిది భాగవతమట,పలికించెడువాడు రామభద్రుండట” అని పోతన అంతటోడే అన్నప్పుడు తెలుగును దేవ భాష అనీ ,తెలుగు భాషలో పాడిన సంగీతాన్ని దైవ సంగీతం అనీ అనటానికి మనకెందుకు సిగ్గు,సందేహం?
సంస్కృత వాసనలేమీ సోకకుండా అచ్చ తెలుగులో లక్ష్మీదేవి హావ భావాలను ఆ రామ భద్రుడే ఎలా పలికించాడో చూడండి:
“అడిగెదనని కడు వడి జను
నడిగిన దన మగడు నుడువడని నడ యుడుగున్
వెడ వెడ సిడిముడి తడబడ
నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్” --- (శ్రీమదాంధ్ర భాగవతం 8:103)
రామ భద్రుడే ఇలా తెలుగులో పలికించాడనీ,పోతన రాయలేక వదిలేసిన పద్యాలను రాముడే వచ్చి స్వయం గా తెలుగులో పూరించి పోయాడనీ , తానీషాకు డబ్బు చెల్లించి రామదాసును విడిపించాడనీ . . . ఇంకా ఎన్నో గొప్పలు చెప్పుకుంటారు. అలాంటి వాళ్ళకు కూడా తెలుగు దేవభాషే అనీ,తెలుగు సంగీతం దివ్య సంగీతం అనీ అనిపించటంలేదా?సంగీత జ్నానము భక్తి వినా సన్మార్గము కలదే ఓ మనసా అన్నాడు త్యాగయ్య.సరిగమలు రాని పామరులనోట కూడా అలవోకగా సాగిన రంగస్థల పద్యాలు తెలుగు వాళ్ళ సొంతం కాదా?ఎన్నెన్ని పద్యాలు ఎన్నో రాగాలతో చెవులతుప్పు వదిలేలా కొండంత దీర్గాలు తీసి పాడుకున్నది తెలుగు వాళ్ళు కాదా?
కోట్లాది ప్రజలు విని పాడి ఆనందించే ఒక సంగీత సంప్రదాయానికి పేరు పెట్టేటప్పుడు అందుకు నిర్ణయించిన ప్రాతిపధికలు ఏమిటో చెప్పాలి.ఆ ప్రాంతంలో నివసించే ప్రజల అభిప్రాయాలూ అడగాలి.ప్రజాస్వామ్య దేశంలో అమలు చేసే పద్ధతే ఇది.
అన్నమాచార్యులు,త్యాగయ్య,రామదాసు లాంటి ఎందరో మహానుభావులు,గొప్ప తెలుగు సంగీత విద్వాంసులు అభివృద్ధి చేసిన సంగీతానికి తెలుగు సంగీతం అని పేరు పెట్టలేనప్పుడు ఏదో ఒకరాష్ట్రం పేరే ఎందుకు? మిగతా దక్షిణాది ప్రాంతాలన్నిటినీ కలుపుకొని ద్రావిడ సంగీతం అనకూడదా? తెలుగు పెద్దలు ఆలోచించాలి.
నూర్ బాషా రహంతుల్లా
స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్
అమరావతి 9948878833

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి