30, ఏప్రిల్ 2018, సోమవారం

ప్రబోధానంద స్వామి గారి సందేశం

తెలుగులో పాలన పుస్తకం పై ప్రబోధానంద స్వామి గారి ఉద్దేశ్యము
ఉన్నత ఉద్యోగములో పని చేయుచున్న రహంతుల్లాగారు తెలుగు భాషపట్ల తనకున్న అభిమానమును తెలియజేస్తూ, తెలుగు భాష పతనమును గురించి ఒక ప్రక్క ఆవేదనను తెలియజేస్తూ, మరో ప్రక్క తెలుగు భాష అభివృద్దికి తన సూచనలు తెలియజేస్తూ, వార్తాపత్రికలలో అనేక వ్యాసములను వ్రాశారు.ఈయన తెలుగు ముస్లిం.తెలుగే ఆయన మాతృభాష. ఆయన తెలుగు భాషపట్ల తెలిపిన అభిప్రాయములన్నియు అక్షర సత్యములు. నిత్యము మనముందర కనిపించుచున్న యదార్థములు, అయినా రహంతుల్లాగారు చెప్పేంతవరకు నేను కూడా అంత లోతుగా గమనించలేదని చెప్పుచున్నాను. తెలుగు భాష రహంతుల్లాగారు గారు చెప్పినట్లు ప్రజలలోనే కాక, ప్రభుత్వములో కూడా ఆదరణకు దూరముగా యున్నదని కనిపించుచున్నది. తొమ్మిది కోట్లమంది తెలుగు భాషను వాడుచున్నా, భాషను సంపూర్ణ అవగాహనతో వాడలేదని తెలియుచున్నది. ఉదాహరణకు ఒక వ్యక్తి ఇలా అంటున్నాడు. నేను బాత్ రూమ్ పోతున్నాను' ఆ మాటను వినేవారికి అర్థమయినా అది సంపూర్ణ వాక్యముగా లేదు. ఆ మాటను చెప్పవలసిన రీతిలో చెప్పలేదు. నేను బాత్రూమ్ కు పోతున్నాను అని చెప్పితే అది సరియైన వాక్యమగును. రూమ్ అను పదము ప్రక్కన 'కు' అను అక్షరము లేనిదానివలన తెలుగు భాషను సగము చంపి వాడినట్లగుచున్నది. అలాగే “ఙ్ఞానము తెలిస్తే మనము మోక్షమునకు పోతాము” అను వాక్యమును చూస్తే జ్ఞానముకు మనము తెలిస్తే మోక్షానికి పోతామా? మనకు జ్ఞానము తెలిస్తే మోక్షానికి పోతామా? అని అనుమానము రాకతప్పదు. ఈ విధముగా తెలుగు భాష తెలుగు వారి మధ్యలో యున్నా అది కొంత అనారోగ్యముతో బ్రతుకుచున్నదని తెలియుచున్నది. ఏది ఏమయినా నూర్ భాషా రహంతుల్లాగారు వ్రాసిన వ్యాసములను చూస్తే 'పవర్ తగ్గిన బ్యాటరికీ తిరిగి చార్జింగ్ పెట్టినట్లు అయినది. ఆయన వ్యాసములను చదివిన ఎవరయినా తెలుగు భాషపట్ల కనువిప్పు పొందవలసిందే. ఎంతమంది మాట్లాడుతున్నారను విషయమును గుర్తు చేయుచూ, 25 భాషలను ఆరుకోట్ల వరకు మాట్లాడుతున్నారనీ తెలుపడము అభినందనీయము. అంతేకాక ఏ భాష, ఏ భాష చేతిలో కలిసిపోయి అంతరించి పోవుచున్నదో, అటువంటి 17 భాషలను గురించి తెలియజేసిన విషయము ఈ గ్రంథములో మీరు చూడవచ్చును. ముఖ్యముగా ఈ రెండు వ్యాసములను చూచిన తర్వాత అంతో ఇంతో తెలుగు భాష అభిమానినయిన నాకే ఆశ్చర్యమయినది. వాస్తవముగా నాకు గానీ, ఇతరులకుగానీ తెలియని విషయములను తెలిపిన నూర్ భాషా రహంతుల్లా గారిని అభినందించక తప్పదు. “వ్యాసము“ అను పదము అచ్చమయిన తెలుగు పదము. ఐదువేల సంవత్సరముల పూర్వము వ్యాసములను కూర్చి వేదములను వ్రాసిన ఆయన పేరును వేదవ్యాసుడు అని పిలిచారంటే, ఆ దినములలో ఆ ప్రాంతములో తెలుగు భాష వాడుకలో ఉండేదని అర్థమగుచున్నది. వేదములను, తర్వాత భగవద్గీతను సంస్కృత భాషలో హిందీ లిపితో వ్రాసినా, అది వ్యాసుడు తనవాడుక భాషలో వ్రాసేదానికంటే కొందరికి మాత్రమే తెలిసిన భాషలో వ్రాస్తే తనకు విలువయుంటుందని తలచి అలా వ్రాశాడని అర్థమగుచున్నది. తర్వాత గతించిన కాలములో తెలుగు కుంచించుక పోవడము, హిందీ వ్యాపించుక పోవడము జరిగినది. వంద సంవత్సరములప్పుడు అటు చెన్నపట్నము వరకు ఇటు బళ్ళారి వరకు వ్యాపించిన తెలుగు, నేడు ఒకవైపు దాదాపు 200 కిలోమీటర్లు జరిగి పుత్తూరు వరకు వచ్చినది. రెండవ వైపు 30 కిలోమీటర్ల వరకు వచ్చినది. తెలుగు భాషలో 'చెన్నపట్నము' అను పిలువబడుచున్న పేరు నేడు 'చెన్నై' అని పిలువబడుచున్నది. ఈ విధముగా పదివేల సంవత్సరముల పూర్వము భారతదేశములోనే కాక, శ్రీలంకలో కూడా తెలుగు ఉండేది. దానికి సాక్ష్యముగా నేటికీ కొన్ని ప్రాంతములలో తెలుగువారుంటూ తమ మాతృభాషను ఇల్లలో మాట్లాడుకొనుచున్నారు. వీరి పూర్వీకులందరూ లంకవారే అయివుండడము వలన పూర్వము లంకలో తెలుగు ఉండేదని తెలియుచున్నది. నేడు కాళ్లు విరిగి ఒక్క ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో మాత్రమే కనిపించు తెలుగు, సృష్ట్యాదిలో ప్రపంచ వ్యాప్తముగా ఉండేదని గతములో మేమే చెప్పియున్నాము. ప్రస్తుత కాలములో కొంత ప్రాంతమునకు, కొంతమందికే పరిమితమైన తెలుగు భాష భవిష్యత్తులో అంతరించిపోతుందన్న భయము కొందరిలో ఉన్నా, అది సంభవించదని మనిషిలో దైవము మీద విశ్వాసమున్నంతవరకు తెలుగు బ్రతికియుంటుందని చెప్పక తప్పదు. ఎందుకనగా! ఆధ్యాత్మికమంతయూ తెలుగు భాషతో ముడివేయబడియున్నది. మొదట ఆధ్యాత్మికము తెలుగు భాషలోనే పుట్టింది. తర్వాత తెలుగు భాషలోనే బ్రతుకుచున్నది. అందువలన దేవుడు శాశ్వితమే, తెలుగు శాశ్వితమే.. ప్రబోధానంద యోగీశ్వరులు ప్రబోధాశ్రమం,చినపొడమల,తాడిపత్రి

27, ఏప్రిల్ 2018, శుక్రవారం

ఎర్రాప్రగడ రామకృష్ణ - చిన్నమాట

నాదో చిన్న మాట
శ్రీ నూర్ బాషా రహంతుల్లా తెలుగు బాషాభిమానిగా సుప్రసిద్ధులు. వారితో నాకు ముఖపరిచయం లేకున్నా ముఖగ్రంథ (ఫేస్ బుక్) పరిచయం చాలాకాలంగానే ఉంది. వ్యాసరచయితగానూ వారు నాకు సుపరిచితులే ! మూడు దశాబ్దాలుగా ఈనాడు దినపత్రిక లో నేను రాసిన వ్యాసాలు – నా దగ్గర లేనివి కూడా వారి వద్ద భద్రంగాఉన్నాయని తెలిసి నేను ముందు ఆశ్చర్య పోయాను, దరిమిలా తీరిగ్గా గర్వపడ్డాను. ప్రస్తుతం ఈ పుస్తకానికి తొలిపలుకులు రాసే క్రమంలో వారికున్న మాతృభాషాభిమానాన్ని గ్రహించి కొంచెం సిగ్గుపడుతున్నాను. సుమారు 15 వేల వ్యాసాలను రచించిన నాకు తెలుగుపట్ల వారికున్నంత నిబద్ధత లేకపోవటం దానికి కారణం. వారిది ఏ స్థాయి అంకిత భావమంటే అధికార రీత్యా కూడా అవకాశం ఉన్న చోటల్లా తెలుగును వాడుక లోకి తేవాలన్నది ఆయన పట్టుదల. ఈ పుస్తకం నిండా దానికి గట్టి ఆధారాలు ఎన్నో లభిస్తాయి. వ్యక్తిగతంగా ప్రభుత్వ యంత్రాంగంలో కీలక పాత్ర పోషిస్తూనే తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తూ, దానితో ఆగి పోకుండా, లిపి సంస్కరణల నుంచి నాయకుల, అధికారుల అలసత్వాన్ని ప్రశ్నించే పాటి గుండె దిటవు నన్ను ఆశ్చర్య చకితుణ్ని చేసింది. అధికార భాషా సంఘం అలసత్వాన్ని , యూపీపిఎస్సీ నిర్వాహకులను ప్రశ్నించడం నన్ను విస్మయానికి గురిచేసింది. ధృఢమైన నిశ్చయం తీవ్రమైన నిబద్ధత విశేషభాషాభిమానం కల్గిన ఇలాంటి అధికారులు ఎందరో ఉన్నా మరీ మన తెలుగు భాష ఎందుకు ఇంతగా వెనుకబడి ఉందనేది నన్ను ఎన్నో ఆలోచనల్లోకి నెట్టింది. ఈ నేపధ్యాన్ని దృష్టిలో పెట్టుకొని భాష పట్ల నా అవగాహనను మీతో పంచుకోవాలనిపిస్తోంది. నా తెలుగుతల్లికి మల్లెపూదండ తెలుగును ‘అజంత‘ భాషగా పిలుస్తారు. మాటలన్నీ అచ్చులతో అంతమవడం దానికి కారణం. తెలుగు సాహిత్యం ఏదేశ భాషకూ తీసిపోదు. సాక్షాత్తు శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువే ‘దేశ భాషలందు తెలుగు లెస్స‘ అన్నాడు. ‘తెలుగదేలయన్న దేశంబు తెనుగు, ఏను తెలుగు వల్లభుండ తెలుగొకండ‘ అని ఒక నిర్ణయానికి వచ్చాడు కృష్ణరాయలు. ‘భాషలొక పది తెలసిన ప్రభువు మదిని గెలుచుకున్నట్టి మేటి మా తెలుగుభాష‘ అని తెలుగువారు గర్వపడుతుంటారు. గీర్వాణ భాషలోని అమరకావ్యాలను తెలుగులోకి అనువదించే అవకాశం లభిస్తే కవులు పొంగిపోయేవారు. ‘నన్నయ తిక్కనాది కవులీయుర్విన్ పురాణావళుల్ తెనుగుం జేయుచు, మత్పురాకృత శుభాధిక్యంబు‘ ఫలించి భాగవతం మాత్రం తనకు వదిలిపెట్టారని పోతన్న ఎంతో ముచ్చటపడ్డాడు. నిజానికి అది పోతన్న అదృష్టం కాదు. తెలుగు వారి పుణ్యఫలం. అలాంటి కవులు జన్మించడం జాతికే గర్వకారణం! తెలుగుభాషను సుసంపన్నం చేసిన ఖ్యాతి ఎందరో సత్కవులకు దక్కుతుంది. ఆది కవి నన్నయ మొదలు- ఆధునిక కవుల వరకు చాలామందికి ఆ పుణ్యంలో భాగం ఉంది. ‘తెరపి వెన్నెల ఆణిముత్యాల సొబగు పునుగు జవ్వాది ఆమని పూలవలపు, మురళి రవళులు కస్తూరి పరిమళములు కలసి ఏర్పడె సుమ్ము మా తెలుగుభాష‘ అన్న నండూరి రామకృష్ణమాచార్య పలుకుల్లో సాహిత్యాభిమానుల గుండె చప్పుళ్ళు ప్రతిధ్వనిస్తాయి. ఆ అభిరుచి విశేషాన్ని ప్రశంసిస్తూ రాయప్రోలు, ‘సంతోషింపగదమ్మ ఆంధ్రజననీ! సారస్వత స్నాన విశ్రాంతి ప్రీతుల, నీదు పుత్రకుల, దీక్షాబద్ధులం చూచి‘ అని తెలుగు తల్లికి విన్నవించారు. చక్కని తెలుగు వింటుంటే సంగీతం విన్నట్లుంటుందన్నది చాలామందికి అనుభవం. విశ్వనాథ ‘ఒక్క సంగీతమేదో పాడునట్లు భాషించునప్డు విన్పించు భాష‘ అంటూ తీపి పలుకును కొనియాడారు. నండూరి దృష్టిలో తెలుగు భాష ‘సాహితీ తరంగ సంగీత రసధుని!‘ ఈ కవులంతా పూర్వకుల సత్తాను పరిచయం చేయడం ద్వారా పాఠకులకు అభిరుచిని నేర్పారు. రసజ్ఞతను మప్పారు. ‘పలికిన పల్కు పల్కునను పట్టున పిండిన క్రొత్త తేనియల్‘ చవి చూపించారు. భాషపై ప్రేమను పెంచారు. పరంపరను కాపాడుతూ వచ్చారు. మన వరకు తెలిసేలా చేశారు. తుమ్మల మాటల్లో ‘ఏ పుణ్యలేశమ్ము నా పాలిదాయెనో నీ పావనోదార శ్రీపరంపరలలో నీ పదార్చకులలో నేను నొక్కడనైతిని‘ అని మనం గర్వించేలా చేశారు. ‘చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, మంచి పుస్తకం మాత్రం కొనుక్కో‘ అని కందుకూరి వీరేశలింగం చెప్పినంత కాకపోయినా యువతరానికి తెలుగుభాషా సాహిత్యాల పట్ల చెప్పుకోదగ్గ సదభిప్రాయం అంటూ ఉంది. అయితే చాలామందికి చదివే ఓపిక, తీరిక లేవు. ‘పొట్టకూటికి కాదివి గిట్టుబాటు‘ అన్న భావంతో కొందరు దూరం పెట్టారు. పట్టుతేనె రుచి తెలియక శాక్రిన్ తీపితో మురిసిపోతున్నారు మరికొందరు .శివకేరా ప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస గ్రంథం ‘యుకెన్విన్‘ అట్టమీద వాక్యం ‘విన్నర్స్ డోన్ట్ డూ ది డిఫరెంట్ ధింగ్స్, దేడూ ది థింగ్స్ డిఫరెంట్లీ‘ అన్నదాన్ని అరవై ఏళ్ళ క్రితమే విశ్వనాధ అంతకన్నా ప్రభావవంతంగా చెప్పారని యువతకు గుర్తు చేసేవారు కరువయ్యారు. రాముడి గురించి మారీచుడు “అందరి వలె మాట్లాడడు,అందరివలె చేయడేదియైనన్ తన ఆత్మం ఒలుకబోసిన చందంబున పలుకు సేయు సర్వము తానై” అని రావణుడికి చెప్పాడు. ఆ వాక్యాన్ని శివకేరా మాటలతో పోల్చి చెబితే ఏది మెరుగైనదో యువత తేల్చుకోగలరు. తెలుగుభాషా సంధర్భాన్ని తిలకించిన వారు, దాని మాధుర్యాన్ని ఆస్వాదించిన వారు యువతకు వాటిని పరిచయం చేయాలన్నది శ్రీ రహంతుల్లా గారి వాదన. దానికి అనుగుణంగా ఆయన చేస్తున్న సూచనలు మెచ్చుకోదగినట్లున్నాయి. లిపిని సంస్కరిస్తేనే మంచి రోజులు , దేవుడికి తెలుగు రాదు వంటి వ్యాసాల్లో ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలను మనం ఈ కోణంలోనే అర్థం చేసుకోవాలి. పార్లమెంటులో తెలుగు వినపడాలి అన్న వ్యాసం చదివినప్పుడు నాకు తమిళుల భాషాభిమానం గుర్తుకొచ్చింది. ఈ విషయంలో మనం చాలా వెనుకబడ్డాం. తమిళుల మాతృభాషాభిమానం ఎంత తీవ్రమైనదో మనకు తెలుసు. భాష విషయంలో వారిది కేవలం మథన కుతూహలంకాదు,కదన కుతూహలమూ వారిలో ఎక్కువే. 1999 లో భాజపా ప్రభుత్వం సంస్కృత భాషకు రాజసత్కారం తలపెడితే మా తమిళం సంగతేమిటని ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. నిరసన దీక్షలు పూనారు. ప్రభుత్వం స్వయంగా బంద్ నిర్వహించింది. జనజీవనం స్తంభించింది. పరభాషా నాయికలు తమిళ చిత్రాలలో నటించడానికి అభ్యంతరం లేదు. అయితే తమిళ భాష నేర్చి,సంభాషణలు స్వయంగా పలికి తీరాలన్నది అక్కడి ప్రజల పట్టుదల. తమ మాతృభాష పట్ల వారికింత ప్రచండమైనది నిబద్ధత, ధృడవైఖరి ఉన్నాయి కాబట్టే – రాజకీయ పక్షాలూ ఆదారినే నడుస్తున్నాయి. 1999 ఆందోళనల్లో తమ భాషకోసం రాజకీయనేతలు జైళ్ళకు వెళ్లారు. అంతెందుకు 1996 ఎన్నికల ముందు తిరుచ్చిలో జరిగిన డిఎంకె సదస్సు తమిళాన్ని కేంద్రం ప్రాచీనభాషగా గుర్తించి తీరాలని రాజకీయ తీర్మానం చేసింది. దాన్ని తమ ఎన్నికల వాగ్దానాలలో ప్రముఖంగా ప్రజల ముందుకు తెచ్చింది. ఈ వైఖరిని తెలుగు ప్రజలు ఏరకంగా అర్థంచేసుకోవాలి? తమిళ మహాసభలు కోయంబత్తూర్ లో వైభవంగా జరిగాయి. కొన్నేళ్ళక్రితం అప్పటి ముఖ్యమంత్రి డా||కరుణానిధి మహాసభల భూమికను వివరిస్తూ ఇరవై రోజుల ముందుగా ‘హిందూ’ పత్రికలో విఫులమైన వ్యాసం రాశారు. ప్రాచీన భాషగా గుర్తింపు పొందేందుకై తమ ముందుతరం చేసిన విశేష కృషిని శ్లాఘిస్తూ మొదలైన ఆ వ్యాసం దానికై తమిళానికి గల అర్హతను, ఔచిత్యాన్ని నిరూపిస్తూ సాగింది. రాబోయే తరాలకు సర్వసత్తాకమైన భాషను అందించడానికి అవసరమైన దిశానిర్దేశం చేస్తూ ముగిసింది. “శాస్త్ర సాంకేతిక రంగాల ప్రగతిని దృష్టిలో పెట్టుకుని, ఆదునిక యుగ అవసరాలకు సరితూగేలా తమిళభాష తగినంత పరిపుష్టిని సాధించుకోవడానికి ఈ మహాసభలు దారిచూపిస్తాయి. రాబోయే శతాబ్దంలోకి భాషను సగర్వంగా తోడ్కొని వెళతాయి“ అని డా||కరుణానిధి తమ ధృడసంకల్పాన్ని వెల్లడి చేశారు. తానే స్వయంగా సమావేశాల ఇతివృత్త గీతాన్ని (థీమ్ సాంగ్) రచించి, అంతటి పెద్దవయసులోనూ ఉత్సవ నిర్వహణకు తానే పూనుకున్నారు. దీంతో ప్రజలు ఎంత ఉత్తేజితులై ఉంటారో మనం ఊహించుకోవచ్చు. మన పొరుగునే ఉన్న తమిళ ప్రజల, రాజకీయ నేతల తపన, భాషపట్ల అంకిత భావం, చిత్తశుద్ధి, దీక్షల నుండి మనం ఏమైనా నేర్చుకోగల్గితే ఎంత బాగుండును ! శ్రీ రహంతుల్లా గారి అభి ప్రాయాలతో మనం పూర్తి గా ఏకీభవించక పోవచ్చు. కాని వారి చిత్తశుద్ధి మాత్రం తప్పక ఆకట్టుకుంటుంది. వారి సూచనలు సర్వదా ఆమోద యోగ్యం అనిపిస్తాయి. వాటికోసం తెలుగువారంతా ఈ వ్యాసాలను తప్పక అనుశీలించాలి. మరో సారి వారిని మనసారా అభినందిస్తూ, వారి నుంచి మరిన్ని వ్యాసాలను ఆహ్వానిస్తున్నాను. ఎర్రాప్రగడ రామకృష్ణ ఈనాడు రచయిత ,రాజమండ్రి 9397907344

సందేశం - విజయభాస్కర్ సంచాలకులు


                              సందేశం     
- డా|| డి. విజయభాస్కర్
మాతృభాషలో బోధన, మాతృభాషలో పాలన ఇటీవల కాలంలో ఊపందుకున్న నినాదం. ఈ నినాదం వెనుక ఒక గొప్ప ఆశయముంది. ఆకాంక్ష ఉంది. ఒక బిడ్డ తల్లి గర్భంలో ఉండగానే ప్రపంచంతో సంబంధం ఏర్పరచుకుంటాడు. అది మాతృభాషతో మొదలవుతుంది. తన పసితనంలో సంజ్ఞల ద్వారా చిన్ని చిన్ని మాటల ద్వారా జరిపే సంభాషణంతా అమ్మనుడితో సాగుతుంది. తర్వాత బడిలో జరిపే బోధన దాని కొనసాగింపుగా మాతృభాషలో జరిగితే అతని అవగాహన సవ్యంగా ఉంటుంది. అలా కాకుండా ఒక్కసారి పరాయి భాష వచ్చి పడేసరికి విద్యార్థి గంద్రగోళ పరిస్థితికి గురవుతాడు. మాతృభాషలో నిష్ణాతుడైన వాడు ఇతర భాషల్లో కూడా ప్రావీణ్యత సాధిస్తాడని శాస్త్రీయంగా నిరూపితమైన సత్యం .

ఇక పరిపాలనకొస్తే, సామాన్యుడే పాలకుడ్ని ఎన్నుకునే అద్భుతమైన వ్యవస్థ వర్థిల్లుతున్న దేశం మనది. ఈ దేశంలో తయారయ్యే చట్టాలు, నియమాలు, నిబంధనలు ప్రజల భాషలో ఉండటం సంస్కారవంతమైన విధానంగా పరిగణించాలి. ఈనాడు ప్రజల అవసరాలు పెరిగాయి. పాలనలో ప్రజల భాగస్వామ్యం పెరిగింది. అధికార్లతో మాటామంతీ పెరిగింది. ఈ నేపథ్యంలో పరిపాలన విదేశీ భాష నుండి స్వదేశీభాషలో అందులోనూ మాతృభాషలోకి మార్చుకోవాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తుంది.

ఆంగ్లేయులు వదిలివెళ్లిన అనేకమైన అవశేషాల్లో ఆంగ్ల భాష ఒకటి. ఇంగ్లీష్ అవసరాన్ని తక్కువ చెయ్యలేం. అలాగే తెలుగు భాష గొప్పదనాన్ని తక్కువ చెయ్యలేం. సంస్కృతం మొదలుకొని నిన్న మొన్నటి ఆంగ్ల భాష వరకు అనేక భాషలతో ఏర్పడిన సంపర్కంతో తెలుగు భాష సుసంపన్నమైంది. పురాణ, ప్రబంధ, కావ్య నాటక ప్రక్రియలకు, తాత్విక, ఆధ్యాత్మిక, న్యాయ వైశేషిక జ్ఞానాన్ని, ఆధునిక శాస్త్రీయ, వైజ్ఞానిక విషయ పరిజ్ఞానాన్ని తనలో ఇముడ్చుకొని అపారమైన శక్తి సంతరించుకుంది తెలుగుభాష.

ఇటువంటి తెలుగు భాషను బోధన భాషగా, పాలన భాషగా ఉపయోగించడంలో చొరవ చూపినవారు అతికొద్ది మంది అధికార్లున్నారు. వారిలో నూర్ భాషా రహంతుల్లా ఒకరు. తెలుగు వాడుక భాషలో పరిపాలన జరగాలని గట్టి పట్టుదలతో పనిచేస్తున్నారు. వారు అనేక సందర్భాల్లో తెలుగువాడకాన్ని సోదాహరణంగా చూపిస్తూ వ్రాసిన పుస్తకం ఇది. ఇందులో పొందుపర్చిన విషయాలు మిగిలిన వారికి ఆదర్శంగా నిలవాలని ఆశిస్తూ, వారి కృషిని అభినందిస్తున్నాను.

తేట తెలుగులో పాలనకోసం బాటలువేద్దాం - శ్రీరాము సత్యనారాయణ కలక్టర్ కర్నూలు



S.Satyanarayana,I.A.S.

Collector & District Magistrate,
Kurnool District.
Office of the
Dist. Collector,
Kurnool District.



Phone : Office : 08518 - 220396, Resi. : 220006, 220131, Fax : Resi. : 08518 - 221914
E-mail: collector krnl@ap.gov.in

తేట తెలుగులో పాలన కోసం బాటలు వేద్దాం

విశ్వకవి శ్రీ రవీంద్రనాథ్ టాగూర్ మనసులోని భావాలను స్వేచ్ఛగా, స్వచ్ఛంగా వ్యక్తం చేసేందుకు మాతృ భాషే, మహాత్తరమైన వాహకం అన్నారు. ఏ విషయాన్నైనా మనం మాతృ బాషలో అర్ధం చేసుకున్నంత సులువుగా పరాయి భాషలో అర్ధం చేసుకోలేమన్నది నిర్వివాదాంశం. పుడమి పొరను తొలుచుకొని మొలుచుకొచ్చే మొగ్గలాగా మాతృ బాషలో మన భావాలు సహజంగా ఉబికివస్తాయి. చెరువు గట్టున నిలబడి చల్లని గాలిని పారవశ్యంతో అనుభవించినట్లు, చెరకు గడను నమిలి తీయందనాన్ని అస్వాదించినట్లు, మాతృ బాషలోని భావాన్ని సులభంగా, అవలీలగా అర్ధం చేసుకోవచ్చు. నారికేళ పాకం కన్నా, పంచదార మాధుర్యం కన్నా తేట తెనుగు తీయదనం మిన్న. తన మాతృ బాష తెలుగు కాకాపోయీనా సాహితీసమరాంగణ సార్వభౌముడిగా గణతికెక్కిన శ్రీ కృష్ణదేవరాయలు తెలుగు పై అపారమైన తృష్ణగలిగి తెలుగు బాషను తెలుగు తల్లి సిగలో నందివర్ధనమై వర్దిల్లేటట్లు చేశారు. అష్టదిగ్గజ కవులతో భువన విజయమును ఏర్పాటుచేసి తెలుగు బాషా వైభవాన్ని దశదిశలా చాటారు. తెలుగేతరులు తెలుగు భాషకు చేసిన సేవను స్మరిస్తున్నపుడు మనం తప్పనిసరిగా పేర్కొనదగిన మహనీయుడు సి.పి.బ్రౌన్ తెలుగు మాధుర్యానికి ముగ్ధుడై తెలుగును అమితంగా ప్రేమించిన బ్రౌన్ గారు బ్రౌణ్యనిఘంటువును రూపొందించడం, ప్రజాకవి వేమన పద్యాలను ఆంగ్లం లోనికి అనువదించి ప్రపంచానికి పరిచయం చేయడం తెలుగు భాషకు జరిగిన అరుదైన సత్కారంగా భావించాలి. తెలుగేతరులు చాలా మంది తెలుగు బాష అనే మందార మొక్కకు నీరుపోసి అనేక కావ్యమందారాలు పూయించి ఆంధ్రావనిని సుందర బృందావనిగా తీర్చిదిద్దారు. అటువంటి సుందర బృందావనిలో ప్రబంధ కావ్యసుమాలు, ద్వని కావ్య సుమదళాలు, ఆద్యాత్మిక కావ్య పుష్పాలు, ఎన్నెనో గుబాళించి తెలుగు బాషను పరిపుష్టం చేశాయి. ఇంతటి పవిత్రమైన తులసి మొక్కల సరసన పరబాషా గంజాయి మొక్కలు పెరగడం దురదృష్టకరం.

 నూర్ బాషా రహంతుల్లా మాతృభాష తెలుగు.ఆయన తెలుగు ముస్లిం. ఆయన తెలుగు భాషలో నూర్ (వెలుగు ) పెంచడం కొరకు, పంచడం కొరకు అనునిత్యం కృషిచేయడం అభినందనీయం. 1988లో అప్పటి ఆంధ్ర ప్రదేశ్ సచివాలయం తనకు రాసిన తెలుగు ఉత్తరాన్ని ఆయన భద్రపరిచి దానిని తెలుగులో పాలనకు అత్యుత్తమ ఉదాహరణగా ఉటంకించడం తెలుగు అములు పై ఆయనకున్న చిత్తశుద్దిని చాటి చెబుతుంది. దాదాపు మూడు దశాబ్దాలుగా అయన తెలుగును పాలనా భాషగా అమలు చేయించడం కోసం అపారమైన కృషి చేస్తున్నారు. కార్యాలయాలలోని దస్త్రాలు తెలుగులోనే రూపొందిస్తే ప్రభుత్వ ఆదేశాలను ప్రజలు సులభంగా అర్ధం చేసుకునేందుకు మార్గం సుగమమవుతుంది. దస్త్రం తెలుగు లో ఉంటేనే సంతకం చేస్తానని అలనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చెప్పినట్లు పాలకులందరూ పట్టుబట్టి ఒక తపస్సులాగా చిత్తశుద్ధితో అమలు చేస్తే తెలుగులో పాలన సాధ్యమవుతుంది.
ప్రస్తుతం ఆంగ్లంలో రూపొందుతున్న కార్యవర్తనములలోని పదాలను తెలుగులో రూపొందిస్తూ ఒక నిఘంటువును తయారుచేసి అంతర్జాలంలో అందుబాటులో ఉంచినట్లయితే దస్ట్రాలు  రూపొందించే వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. తెలుగులో దస్తాలు రూపొందించడం పై ఉద్యగులందరికి తరచుగా శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటుచేయడం అత్యవసరం.
పల్లెసీమల్లో నివసిస్తున్న సామాన్య ప్రజలే నేడు తెలుగు భాషను బ్రతికించుకుంటున్నారు. పట్టణాలు, నగరాలలో పెరుగుతున్న అంగ్లమాధ్యమ వ్యామోహం తెలుగు ప్రాధాన్యతను తగ్గిస్తుంది. ఈ వైఖరిని అంతమొందించి భావితరాల వారికి తెలుగు భాష పట్ల ఆసక్తిని పెంపొందించాల్సిన ఆవశ్యకత ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 2018 సంవత్సరాన్ని తెలుగుభాషా సంవత్సరంగా ప్రకటించింది. ఈ సంవత్సరంలోనే తెలుగు పాలనా భాషగా పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు అందరం కంకణ బద్దులమవుదాం. మనతేట తెలుగులో పాలన కోసం బాటలు వేద్దాం !.
                                                       శ్రీరాము సత్యనారాయణ
సర్వోన్నతాధికారి,     
కర్నూలు జిల్లా